టీడీపీ శ్రేణులు ఐక్యతతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలి.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 23:
మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం బుధవారం ఇబ్రహీంపట్నంలోని ముత్తవరపు వారి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొన్నారు. తొలుత అన్న ఎన్టీఆర్ గారి ప్రతిమకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ పార్టీ శ్రేణులంతా ఐక్యతతో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత కోపాలు, ద్వేషాలకు రాజకీయాల్లో స్థానం ఇవ్వకుండా ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయడమే తన రాజకీయ విధానమని తెలిపారు.
తన ఎనిమిదేళ్ల రాజకీయ ప్రయాణంలో వ్యక్తిగత ప్రయోజనాలు, ఎవరి మీద కోపం లేదా ద్వేషంతో తాను ఎప్పుడూ పనిచేయలేదని, మైలవరం ప్రాంతం, ప్రజల కోసం చేయగలిగిన ప్రతి పనిని చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న వేదిక అని పేర్కొన్నారు.
చంద్రబాబు గారు, లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకుని పార్టీ కార్యకర్తలు పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. పార్టీ అంతర్గత విభేదాలు, గ్రూపు తగాదాలకు దూరంగా ఉంటూ ప్రభుత్వం–ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని కోరారు. ప్రజలకు అందాల్సిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడా అడ్డంకులు కల్పించకుండా వాటిని ప్రజలకు చేరేలా చూడాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు.
పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం అండ
మైలవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.27.20 కోట్ల మేర ఆర్థిక సహాయం అందిందని ఎమ్మెల్యే తెలిపారు. పేద ప్రజల వైద్యం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉదాత్తంగా సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సహాయాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
ప్రజలకు అవసరమైన సహాయాన్ని వేగంగా అందించేందుకు తన కార్యాలయంలో ముగ్గురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు తమ స్థాయిలో పరిష్కరించగలిగిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సంబంధిత అధికారులు లేదా పోలీస్‌స్టేషన్ స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలను అక్కడే పరిష్కరించేలా సహకరించాలని సూచించారు. తమ పరిధిలో లేని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే సాధ్యమైన మేరకు పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
ప్రతి వారం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని, కొన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం లభిస్తుండగా మరికొన్ని సమస్యలకు కొంత సమయం పడుతోందని, అయినప్పటికీ పరిష్కారం అయ్యే వరకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత
రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలకు, ప్రజాక్షేత్రంలో బలం ఉన్న వారికి ప్రాధాన్యత కల్పించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేయాలని కోరారు.
కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలను కూడా కలుపుకుని ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనసేన, బీజేపీలతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, కూటమి కుటుంబ సభ్యులంతా కలిసి పనిచేయడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలమని అన్నారు.
ప్రతి ఓటు కీలకమే
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఓటు ఎంతో కీలకమని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు. ఒక వార్డులో ఐదు, పది ఓట్ల తేడాతో గెలుపు–ఓటములు నిర్ణయమయ్యే అవకాశం ఉందని, కొన్ని సందర్భాల్లో పంచాయతీలో ఒక్క ఓటు కూడా కీలకంగా మారుతుందని తెలిపారు. అందువల్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి గ్రామంలో ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు.
తాను ఇప్పటికే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, ఇక తన దృష్టి పార్టీ శ్రేణుల గెలుపుపైనే ఉందని చెప్పారు. గ్రామంలోని వార్డు సభ్యుడి నుంచి సర్పంచ్, కౌన్సిలర్ వరకు పార్టీ తరఫున పోటీ చేసే ప్రతి ఒక్కరి విజయానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
పేద కుటుంబాలకు విద్య, వైద్యం అత్యంత ఖరీదైన అంశాలుగా మారుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి వంటి పథకాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అర్హులకు చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు చొరవ చూపాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు కోరారు.
ఈ సమావేశంలో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.




