– రైతులు, ప్రజల ఇబ్బందులను వెంటనే గుర్తించాలి
– అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు చేపట్టాలి
చిట్వేల్ మండలంలో సాగునీరు, తాగునీటి సమస్యలపై సీపీఐ నాయకులు స్పందించారు. నీటి కొరతతో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బుధవారం తహసీల్దార్ నరసింహారావుకు వినతిపత్రం అందజేశారు. సీపీఐ రాష్ట్ర పిలుపు మేరకు చేపట్టిన కార్యక్రమంలో మండల నాయకులు తిప్పన ప్రసాద్, సామా గంగయ్య మాట్లాడుతూ సాగునీరు అందక పంటల సాగుపై ప్రభావం పడుతోందని తెలిపారు. మరోవైపు పలు గ్రామాల్లో తాగునీటి సమస్య ప్రజలకు ఇబ్బందిగా మారిందన్నారు. సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి అత్యవసర చర్యలు చేపట్టాలని కోరారు. తాగునీటి కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని, చెరువులు, కాలువలు, నీటి వనరుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. సాగునీటి లభ్యతపై రైతులకు స్పష్టమైన సమాచారం ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో నీటి కొరత రాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ గ్రామ కార్యదర్శి పి.దేవి నారాయణ పాల్గొన్నారు.


