అంగన్వాడీ వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదని చెబుతున్న ప్రభుత్వం..వారికి ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు లభించే సామాజిక భద్రత సదుపాయాలు కూడా లేకపోవడం ఎంతవరకు న్యాయమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి ప్రశ్నించారు. సోమవారం మండలంలోని భాకరాపేట గ్రామంలో ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో వర్కర్లు, హెల్పర్లు ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నప్పటికీ వారి కుటుంబాలకు సరైన సామాజిక భద్రత లేకపోవడం ఆందోళనకరమన్నారు.అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల కుటుంబాల్లో ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి వృద్ధాప్య, వికలాంగ, వితంతు, ఒంటరి మహిళల పింఛన్లు పొందేందుకు ప్రత్యేక అర్హత కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. అంగన్వాడీ సిబ్బంది సేవలను ప్రభుత్వం గుర్తించి వారి కుటుంబాలకు కూడా సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ సిబ్బంది కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఇలాంటి నిబంధనలు విధించలేదని రాజేశ్వరి రెడ్డి పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ప్రస్తుతం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల కుటుంబాల్లో అర్హులైన వారికి పింఛన్లు అందేలా ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని డిమాండ్ చేశారు.అంగన్వాడీ సిబ్బంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సేవలు అందిస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారని అన్నారు. అలాంటి సిబ్బంది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వారికి సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్, ఇతర సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏకుల రాజేశ్వరి రెడ్డి కోరారు.


