ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో రేపు మూడో శనివారం సందర్భంగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (PTM), నో బ్యాగ్ డే నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సదానందం, సీఎంఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన స్థాయిలు, పాఠశాల హాజరు, గైర్హాజరు కారణాలు, విద్యార్థుల పురోగతిపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో చర్చించనున్నారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఆదేశాల మేరకు ‘అమ్మ పేరుతో ఒక మొక్క నాటడం’ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థితో మొక్క నాటించేలా మెగా వన మహోత్సవం నిర్వహించనున్నారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంచే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యాశాఖ అధికారులు కోరారు.



