*త్వరలో ఇల్లు పట్టాలు.. ఇంటింటికీ తాగునీరు**పాయకరావుపేట సమగ్ర అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి**ఇల్లు ఉండి పట్టాలు లేని అర్హులకు త్వరలో పట్టాలు**జల జీవన్ మిషన్‌తో ఇంటింటికీ తాగునీరు**అధికారుల విధుల్లో అలసత్వాన్ని ఉపేక్షించేది లేదు: హోం మంత్రి అనిత*నక్కపల్లి, సెప్టెంబర్ 15: పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో ఇల్లు ఉండి పట్టాలు లేని, అర్హులకు త్వరలోనే ఇళ్ల పట్టాలు అందించే చర్యలు చేపడతామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అలాగే జల జీవన్ మిషన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నక్కపల్లి ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఎలక్ట్రికల్, పీఆర్ ప్రాజెక్ట్స్, ఎండోమెంట్, పీఆర్ ఇంజినీరింగ్ తదితర శాఖల పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పాయకరావుపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి అనిత అన్నారు. అధికారులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని, విధుల్లో ఎలాంటి అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.*పోలవరం జలాలతో కొత్త అభివృద్ధి*పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లి జిల్లాకు తీసుకురావడం ఎంతో సంతోషకరమైన విషయమని మంత్రి అన్నారు. పాయకరావుపేట ప్రాంతంలో పోలవరం కాలువ పరిసరాలను భవిష్యత్తులో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. సౌర విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు, వివిధ వసతులు కల్పిస్తోందని చెప్పారు.*గ్రామాల్లో సీసీ కెమెరాలు*గ్రామస్థాయిలో ట్రాఫిక్ నిబంధనలపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని హోం మంత్రి సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపేవారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని గ్రామాల్లో కూడా సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసు అధికారులకు సూచించారు.*నక్కపల్లి బాయ్స్ హైస్కూల్ మోడల్ స్కూల్‌గా*నక్కపల్లి బాయ్స్ హైస్కూల్‌ను మోడల్ స్కూల్‌గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత తెలిపారు. నియోజకవర్గంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.*ఇంజినీర్ల సేవలు చిరస్మరణీయం*ఇంజినీర్స్ డే సందర్భంగా ఇంజినీర్లకు హోం మంత్రి అనిత శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ ఇంజినీరింగ్ రంగానికి విశేష సేవలు అందించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజినీర్ల సేవలను స్మరించుకోవాలని అన్నారు. దేశ నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర అత్యంత కీలకమని, అభివృద్ధి పనుల్లో వారి నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని పేర్కొన్నారు.పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని హోం మంత్రి అనిత సూచించారు.


