దంసలపురం చెరువులో చేపల పెంపకం జరుగుతున్నందున వినాయక విగ్రహాల నిమజ్జనాలు చేయవద్దని మత్స్యకారుల సొసైటీ అధ్యక్షులు ముద్రబోయిన అప్పారావు, పగడాల మల్లేష్ కోరారు. నిమజ్జనాల సమయంలో విగ్రహాల రంగులు, రసాయనాలు నీటిలో కలవడంతో చేపలు మృత్యువాత పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చేపల పెంపకంపై ఆధారపడి సుమారు 80 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. చేపల పెంపకం కోసం సొసైటీ సభ్యులు అప్పులు చేసి సుమారు రూ.కోటి పెట్టుబడి పెట్టారని చెప్పారు. నిమజ్జనాల వల్ల చేపలకు నష్టం జరిగితే తమ కుటుంబాల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటుందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ నిమజ్జన ప్రాంతాన్ని ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలని మత్స్యకారులు కోరారు.



