కల్లూరు / ఖమ్మం
నేరాల నియంత్రణతో పాటు పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. బుధవారం కల్లూరు పోలీస్ స్టేషన్ను ఆయన సమగ్రంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణ చర్యలు, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పెండింగ్ కేసులను నిర్దేశిత గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి, నేరస్తులకు శిక్ష పడేలా పటిష్టమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. మహిళలు, బాలలపై జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రౌడీషీటర్లు, పాత నేరస్తులు, అనుమానితుల కదలికలపై నిఘా ఉంచాలని, రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేయాలని సూచించారు. గంజాయి, మాదకద్రవ్యాల విక్రయాలు, అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. ప్రజలకు మరింత చేరువగా పనిచేస్తూ శాంతిభద్రతలను కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ పాల్గొన్నారు.


