•బాలికలకు శానిటరీ ప్యాడ్ల పంపిణీ
*సూళ్లూరుపేట సెప్టెంబర్ 8 *
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఋతుస్రావ సమయంలో పరిశుభ్రత పాటించడం, ఆరోగ్య పరిరక్షణపై బాలికలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో సూళ్లూరుపేటలోని ప్రభుత్వ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తడ మండలం మాంబట్టు సెజ్‌లోని టాటా కెమికల్స్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా టాటా కెమికల్స్ సంస్థ నుంచి వచ్చిన మహిళా ప్రతినిధులు బాలికలకు ఋతుస్రావ ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, సురక్షితమైన పద్ధతులు, శానిటరీ ప్యాడ్లను సరైన విధంగా ఉపయోగించడం, వినియోగించిన ప్యాడ్లను పరిశుభ్రంగా పారవేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహా తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.
కార్యక్రమంలో భాగంగా అవసరమైన బాలికలకు శానిటరీ ప్యాడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఋతుస్రావంపై ఉన్న అపోహలు, సంకోచాలను తొలగించి బాలికలు తమ ఆరోగ్యం గురించి స్వేచ్ఛగా మాట్లాడేలా ప్రోత్సహించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఇలాంటి అవగాహన కార్యక్రమాలు బాలికల్లో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన ఋతుస్రావ పద్ధతులను అలవర్చుకోవడానికి దోహదపడతాయని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. మహిళలు, బాలికల ఆరోగ్యం, విద్య, ఆత్మవిశ్వాసం, సాధికారతకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.


