కున్సి గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమైన ర్యాలీ గ్రామ ప్రధాన వీధుల మీదుగా వేణుగోపాల స్వామి దేవస్థానం వరకు సాగింది. ప్రత్యేకంగా ఎద్దుల బండిపై శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఊరేగించడం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.
నారాయణ సేన, గ్రామ యువత ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో దాదాపు 130 మంది చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలో పాల్గొన్నారు. వేషధారణలో పాల్గొన్న ప్రతి చిన్నారికి బహుమతులు అందజేశారు. అలాగే కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తిశ్రద్ధలతో జరిగిన వేడుకలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది



