– ఎండోమెంట్ నిధులతో నూతన ఆలయ నిర్మాణం.. భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన పనులు
చిట్వేలు మండలం కె.కందులవారిపల్లి పంచాయతీ ఎన్టీఆర్ కాలనీలో శ్రీరాముల స్వామి నూతన ఆలయ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఎండోమెంట్ శాఖ నిధులతో చేపట్టనున్న ఆలయ నిర్మాణ పనులకు వేదమంత్రోచ్ఛారణల మధ్య శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణ కార్యక్రమంలో రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. ఎన్నో ఏళ్లుగా గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు కేంద్రంగా ఉన్న శ్రీరాముల స్వామి ఆలయానికి నూతన నిర్మాణం చేపట్టడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తై భక్తులకు అందుబాటులోకి రావాలని ముక్కా వరలక్ష్మి ఆకాంక్షించారు. శ్రీరాముల స్వామి కృపతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా జీవించాలని ప్రార్థించారు. నూతన ఆలయ నిర్మాణంతో భక్తులకు మరింత మెరుగైన ఆధ్యాత్మిక వాతావరణం, వసతులు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, భక్తులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


