
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా
మరిపెడ, సెప్టెంబర్ 5:ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.భారత మాజీ రాష్ట్రపతి, తత్వవేత్త, ఆదర్శ ఉపాధ్యాయుడు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థులకు జ్ఞానం, వివేకం అందిస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో అమూల్యమైనదని అన్నారు. ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో గురువుల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.దేశ ప్రగతికి బాటలు వేస్తున్న ఉపాధ్యాయుల జ్ఞానం, మార్గదర్శనం, అంకితభావం ప్రతి విద్యార్థి జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు.ఈ కార్యక్రమంలో మరిపెడ మండల అధ్యక్షులు గుగులోత్ రవి నాయక్, మున్సిపల్ చైర్మన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు రామ్ లాల్, వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

