రఘునాథపాలెం/ ఖమ్మం
రఘునాథపాలెం మండలంలో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో భాగంగా ఓటర్ల నమోదుపై సమగ్ర విచారణ నిర్వహించి, అనుమానాస్పద నమోదులను గుర్తించాలని భారతీయ జనతా పార్టీ రఘునాథపాలెం మండల శాఖ నాయకులు కోరారు. పలు మీడియా కథనాల్లో వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ మండల తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. బయట ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు, రోహింగ్యాలు తప్పుడు దస్తావేజులతో ఓటర్లుగా నమోదు చేసుకుంటున్నారన్న ఆరోపణలపై క్షుణ్ణంగా విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించాలని కోరారు. దేశ భద్రత, సామాజిక స్థిరత్వం, మహిళల రక్షణ, స్థానికుల ఉపాధి అవకాశాలపై అక్రమ ఓటర్ల ప్రభావం ఉండే అవకాశం ఉందని నాయకులు తెలిపారు. SIR ప్రక్రియలో ప్రతి ఓటర్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారికే ఓటు హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు గుత్తా వంశీ, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గంధసిరి వీరభద్రం గౌడ్, ఎస్టీ మోర్చా జిల్లా నాయకులు లకావత్ రమేష్, సీతయ్య తదితరులు పాల్గొన్నారు.



