సెప్టెంబర్ 3 నుంచి రిజిస్ట్రేషన్.. 9న సీట్ల కేటాయింపు ఫలితాలు
12 నుంచి 18 వరకు కళాశాలల్లో చేరేందుకు అవకాశం
ఏఐక్యూ, డీమ్డ్, కేంద్ర విశ్వవిద్యాలయాల సీట్లకు ఎంసీసీ షెడ్యూల్
నీట్–యూజీ 2026లో భాగంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల రెండో విడత ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) షెడ్యూల్‌ను ప్రకటించింది. 15 శాతం అఖిల భారత కోటా (ఏఐక్యూ), 100 శాతం డీమ్డ్, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఏఎఫ్‌ఎంసీ, ఎయిమ్స్, జిప్‌మర్ సంస్థల్లోని సీట్లకు ఈ కౌన్సెలింగ్ వర్తిస్తుంది. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో పాల్గొనే కళాశాలలు తాత్కాలిక సీట్ల వివరాలను పరిశీలించనున్నాయి. సెప్టెంబర్ 3 నుంచి 8 వరకు అభ్యర్థుల రిజి్రస్టేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుంది.*
సెప్టెంబర్ 8న మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండగా.. ఫీజు చెల్లింపునకు సాయంత్రం 6 గంటల వరకు గడువు ఉంటుంది. అదే సమయంలో సెప్టెంబర్ 3 నుంచి 9 వరకు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 9 ఉదయం 10 గంటల వరకు ఛాయిస్ ఫిల్లింగ్ అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 8 సాయంత్రం 4 గంటల నుంచి సెప్టెంబర్ 9 ఉదయం 10 గంటల వరకు చాయిస్ లాకింగ్ చేసుకోవాలి. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఎంసీసీ సీట్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించనుంది.*
సెప్టెంబర్ 11న రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలను వెల్లడించనుంది. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 12 నుంచి 18 వరకు సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేసి చేరాల్సి ఉంటుంది. చేరిన అభ్యర్థుల వివరాలను ఆయా కళాశాలలు సెప్టెంబర్ 19న ఎంసీసీకి ధ్రువీకరించాల్సి ఉంటుంది. రెండో విడతలో సీటు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు గడువులను తప్పకుండా పాటించాలని ఎంసీసీ సూచించింది. ముఖ్యంగా చాయిస్ ఫిల్లింగ్, లాకింగ్ గడువు దాటిన తర్వాత మార్పులకు అవకాశం ఉండదని స్పష్టం చేసింది.
రాష్ట్ర కోటా కౌన్సెలింగ్‌లో
రాష్ట్ర కోటా కౌన్సెలింగ్‌లో భాగంగా సీట్లు పొందిన అభ్యర్థుల వివరాలను సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు రాష్ట్ర వైద్య విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర కౌన్సెలింగ్ సంస్థలు పరిశీలించనున్నాయి. ఏఐక్యూ, డీమ్డ్, కేంద్ర విశ్వవిద్యాలయాల పరిధిలో చేరిన అభ్యర్థుల వివరాలను ఎంసీసీ సెప్టెంబర్ 19న ధ్రువీకరించనుంది. రాష్ట్ర కోటాలో చేరిన వారి వివరాలను కూడా సెప్టెంబర్ 19న ధ్రువీకరించనున్నారు.
కౌన్సెలింగ్ ప్రక్రియకు సమయం పరిమితంగా ఉన్నందున శని, ఆదివారాలు, గెజిటెడ్ సెలవు రోజులను కూడా పనిచేసే రోజులుగా పరిగణించాలని అన్ని వైద్య కళాశాలలు, సంస్థలకు ఎంసీసీ సూచించింది. రెండో విడతలో సీటు పొందిన విద్యార్థులు నిర్ణీత గడువులో చేరకపోతే సీటుపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున అభ్యర్థులు షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

