దాతల సహకారంతో శ్రీ శ్రీ ధార పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధి
భక్తుల సౌకర్యార్థం పలు అభివృద్ధి పనులు
మూడు హుండీల ఏర్పాటు.. ఆలయం చుట్టూ గ్రిల్స్
రూ.40 వేలతో వాటర్ ఫిల్టర్.. రూ.70 వేలతో ముఖద్వారం నిర్మాణం
విజయనగరం జిల్లా బ్యూరో, రమణ, ఆగస్టు 23 (ప్రజా ప్రతిభ):
కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెం గ్రామంలో కొలువైన శ్రీశ్రీ దార పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి గొలుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దేవస్థానం ప్రభుత్వ పరిధిలోకి వచ్చిన అనంతరం ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు.
ఆలయ ప్రాంగణంలో మూడు హుండీలను ఏర్పాటు చేయడంతో పాటు ఆలయం చుట్టూ గ్రిల్స్, ప్రహరీ గోడను నిర్మించారు. ఆలయాన్ని ఆధునీకరించడంతో పాటు భక్తులు కాళ్లు కడుక్కునేందుకు నీటి కుళాయిలను కూడా ఏర్పాటు చేశారు.
అలాగే దాత తిరుపతి తారకేశ్వర్ రూ.40 వేల ఆర్థిక సహకారంతో భక్తుల తాగునీటి సౌకర్యార్థం వాటర్ ఫిల్టర్‌ను ఏర్పాటు చేశారు. కొత్తవలసకు చెందిన ఎల్లపు భార్గవ రాజేష్ కుటుంబ సభ్యులు రూ.70 వేల విరాళంతో ఆలయానికి వెళ్లే మార్గంలో ఇనుప ముఖద్వారం (ఆర్చ్ గేట్) నిర్మించారు.
ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి జి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. దాతల సహాయ సహకారాలతో ఆలయంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలను దశలవారీగా మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం గుమస్తా తిరుపతి చంద్రశేఖర్, ఆలయ పూజారులు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




