భూపాలపల్లి: 16 ఆగస్టు (పున్నమి ప్రతినిధి):ప్రజల సమస్యలకు స్థానికంగానే పరిష్కారం చూపే విధంగా ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
ప్రజల సమస్యలను స్థానికంగానే తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మండల కేంద్రాల్లో ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి పరిష్కరించాలని సూచించారు.
మండల ప్రజలు తమ సమస్యలు, వినతులు, అభ్యర్థనలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావడానికి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి దరఖాస్తును పరిశీలించి, నిర్ణీత సమయంలో పరిష్కరించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
అదేవిధంగా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల వివరాలను నమోదు చేసి, వాటి పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు.


