అమీన్ పీర్ దర్గా ఊరుసు ఉత్సవాల్లో అంజాద్ బాషా
కడప, పున్నమి ప్రతినిధి: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కడప అమీన్ పీర్ దర్గాలో నిర్వహిస్తున్న హజరత్ ఖ్వాజా సయ్యద్ షా అమీనుల్లా మొహమ్మద్ ముహమ్మదుల్ హుస్సేని చిష్తివుల్ ఖాదరి సాహెబ్ వారి గంధం మహోత్సవం, ఊరుసు ఉత్సవాల్లో మాజీ డిప్యూటీ సీఎం, కడప నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.బి. అంజాద్ బాషా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంజాద్ బాషా పెద్ద దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గాలో పూలచాదర్ సమర్పించి ఫాతెహ నిర్వహించారు. అనంతరం దర్గా పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరీఫుల్లా సాహెబ్‌ను గౌరవపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు స్వీకరించారు.
అనంతరం అంజాద్ బాషా మాట్లాడుతూ, హజరత్ ఖ్వాజా సయ్యద్ షా అమీనుల్లా మొహమ్మద్ ముహమ్మదుల్ హుస్సేని చిష్తివుల్ ఖాదరి సాహెబ్ వారి ఊరుసు ఉత్సవాల సందర్భంగా కడప జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మతాలకు అతీతంగా చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించే అమీన్ పీర్ దర్గాకు దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రార్థనలు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు.
అమీన్ పీర్ దర్గా కడప నగరానికి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన పవిత్ర స్థలంగా గుర్తింపు పొందిందని ఆయన పేర్కొన్నారు. ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మహమ్మద్ షఫీ, మున్నా, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తోటా కృష్ణ, జిల్లా కార్యదర్శి రమేష్ రెడ్డి, నార్త్ జోన్ మండల అధ్యక్షుడు డి.హెచ్. ఇలియాస్, నాయకులు గయా బాబు, ఫారూక్, సైఫ్ తదితరులు పాల్గొన్నారు.



