దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో నాలుగు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన తెలంగాణ వ్యవసాయ, సహకార, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అరుదైన ఘనత సాధించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఇప్పటివరకు 20 సార్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన, ఈ నెల 15న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21వసారి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
1985లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తుమ్మల, ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్, రేవంత్‌రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా సేవలందించారు. మైనర్ ఇరిగేషన్, రోడ్లు-భవనాలు, ప్రొహిబిషన్-ఎక్సైజ్, మేజర్-మైనర్ ఇరిగేషన్ వంటి కీలక శాఖలను నిర్వహించారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ, సహకార, జౌళి శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు.
తుమ్మల ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొందారు. 1985 నుంచి 1989 వరకు ఐదుసార్లు, 1995 నుంచి 2003 వరకు తొమ్మిదిసార్లు, 2015 నుంచి 2018 వరకు నాలుగుసార్లు, 2024, 2025లో ఒక్కోసారి జెండా ఆవిష్కరించారు.
పార్టీలు, ప్రభుత్వాలు మారినా ప్రజాప్రతినిధిగా తుమ్మల కొనసాగిన తీరు, ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్, రేవంత్‌రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన అనుభవం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.



