పామూరు, ఆగస్టు
విద్యార్థులు స్నేహపూర్వకంగా ఉంటూ క్రమశిక్షణతో విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని అక్షర విద్యాసంస్థల అధినేత కదిరి బాబు రంగారావు సూచించారు. స్థానిక పువ్వాడ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన ఫ్రెషర్స్–ఫేర్వెల్ డే వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కదిరి సత్యబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగా చేరిన విద్యార్థులకు సీనియర్లు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కదిరి బాబు రంగారావు మాట్లాడుతూ, ఫ్రెషర్స్ డే ద్వారా జూనియర్లు సీనియర్లు, అధ్యాపకులతో సత్సంబంధాలు ఏర్పరుచుకుని కొత్త వాతావరణానికి అలవాటు పడే అవకాశం లభిస్తుందన్నారు. విద్యార్థుల్లో ఉండే సంకోచం, భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. అక్షర విద్యాసంస్థలు క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తూ, ర్యాగింగ్‌కు తావులేని స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్ షోలు తల్లిదండ్రులు, అధ్యాపకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



