కిస్టాపూర్లో బౌద్ధ ధర్మానికి కొత్త ఊపు
తొలిసారిగా ఘనంగా ‘వర్షవాస్’ ప్రారంభం.. యువతలో ధర్మ విలువల పెంపునకు సంకల్పం
రెబ్బెన, ఆగస్టు 2: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కిస్టాపూర్ గ్రామంలో తొలిసారిగా నిర్వహించిన వర్షవాస్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. బౌద్ధ ఉపాసకులు, యువత, మహిళలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
వర్షవాస్ కాలంలో ధర్మ అధ్యయనం, త్రిపిటక గ్రంథాల పఠనం, ధ్యానం, సద్గుణాల ఆచరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని వక్తలు తెలిపారు. బుద్ధుని బోధనలు సమాజంలో శాంతి, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
సెంటర్ కమిటీ ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రశాంత్ మాట్లాడుతూ, యువతలో బౌద్ధ ధర్మ విలువలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. కిస్టాపూర్లో ప్రారంభమైన వర్షవాస్ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది మరింత విస్తృతంగా నిర్వహించేలా కృషి చేస్తామని తెలిపారు.
వర్షవాస్ కాలమంతా గ్రామంలో ధర్మబోధనలు, గ్రంథ పఠనం, ధ్యాన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ బౌద్ధ ధర్మ ప్రచారాన్ని బలోపేతం చేయాలని బౌద్ధ బంధువులు సంకల్పించారు.
ఈ కార్యక్రమంలో సెంటర్ కమిటీ ఉపాధ్యక్షులు కోబ్రగడె విలాస్, సుబ్బయ్య, సహాయ కార్యదర్శి తక్సండే శంకర్, బౌద్ధ అధ్యాపకులు కిషన్, పండు, కంబాల గ్రామ అధ్యక్షులు దుర్గం శివాజీ, ఆనంద్, కల్చరల్ సభ్యుడు కట్కర్ అజిత్, కిస్టాపూర్ గ్రామ అధ్యక్షుడు చునర్కర్ పాపయ్య, అంబేద్కర్ పరిరక్షణ కమిటీ నాయకురాలు సునర్కర్ ప్రేమల, గోమాస్ రూప సమాజ్ అధ్యక్షుడు సునర్కర్ శంకర్, సునర్కర్ మొండయ్య, వార్డు సభ్యుడు గోమాస్ శ్రీకాంత్, సునర్కర్ సురేష్తో పాటు గ్రామ ఉపాసకులు, ఉపాసికలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


