విద్యా వ్యాపారీకరణ, విద్యా అరాచకత్వం నుండి చదువు నీ తద్వారా వచ్చే విజ్ఞానాన్ని భారతదేశం తిరిగి స్వాధీనం చేసుకోవాలి.
విద్య అనేది ప్రైవేట్ లాభాల కోసం వ్యాపారం చేసే ఒక సరుకు కాదు; అది ఒక రాజ్యాంగ బాధ్యత, సామాజిక హక్కు, శాస్త్రీయ పురోగతికి, ప్రజాస్వామ్యానికి మానవాభివృద్ధికి పునాది. శాస్త్రసాంకేతిక రంగాలలో నాయకత్వం సాధించిన ప్రతి నాగరికదేశం విద్యను ఒక వ్యాపార సరకుగా కాకుండా, ప్రజా పెట్టుబడిగా భావించింది. జ్ఞానం అనేది మార్కెట్ వస్తువుగా మారినప్పుడు, సమాజమే ఒక మార్కెట్‌గా మారిపోతుంది; అక్కడ చదువు అనేది ప్రతిభకు బదులుగా సంపద ఆధారంగా కొనుగోలు చేయబడుతుంది. విద్యను వాణిజ్యీకరించే దేశం అంతిమంగా తన భవిష్యత్తునే వ్యాపారమయం చేసుకుంటుంది.
ఆర్థిక వ్యవస్థే ఆధిపత్య భావజాలాలను శాసిస్తుంది. అందుకే, విద్యాసంస్థలు ఎప్పటికీ రాజకీయంగా తటస్థంగా ఉండలేవు. అవి ప్రస్తుతమున్న ఉన్న సామాజిక అసమానతలనే మళ్లీ పునరావృతం చేస్తాయి, లేదా శాస్త్రీయ పరిజ్ఞానం మరియు చైతన్యం ద్వారా ప్రజల విముక్తికి సాధనాలుగా మారతాయి. అలాగే
దోపిడీని అధిగమించడానికి మరియు ప్రజాస్వామ్య, సామాజిక అభివృద్ధిలో చురుగ్గా పాల్గొనడానికి సామాన్య ప్రజలకు అవసరమైన శాస్త్రీయ అవగాహనను అందించే మార్గంగానే విద్యను చూడాలి. విశ్వవిద్యాలయాలు కేవలం కార్పొరేట్ మార్కెట్ల కోసం సాంకేతిక నైపుణ్యం కలిగిన కార్మికులను ఉత్పత్తి చేయడమే కాకుండా, స్వతంత్రంగా ఆలోచించేవారిని, నూతన ఆవిష్కర్తలను తయారు చేయాలి.
దురదృష్టవశాత్తూ, సమకాలీన భారతదేశంలో విద్య ఒక లాభాపేక్ష కలిగిన పరిశ్రమగా వేగంగా రూపాంతరం చెందుతోంది. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కోచింగ్ సెంటర్లు, టెస్టింగ్ ఏజెన్సీలు, ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలు మరియు స్కిల్-డెవలప్‌మెంట్ సంస్థలు అకడమిక్ సూత్రాల కంటే వ్యాపార సూత్రాల ఆధారంగానే ఎక్కువగా నడుస్తున్నాయి. విద్యార్థులను తల్లిదండ్రులను వినియోగదారులుగా, ఉపాధ్యాయులను సంస్థాగత లాభాల కోసం పనిచేసే ఉద్యోగులుగా, మరియు జ్ఞానాన్ని ఒక అమ్మకపు సరుకుగా పరిగణిస్తున్నారు. విద్యను శాస్త్రీయ నైపుణ్యం, అకడమిక్ స్వేచ్ఛ లేదా సమాజానికి చేసే సేవల ఆధారంగా కాకుండా… రాబడిని సమకూర్చుకోవడం, బ్రాండింగ్, మార్కెట్ ర్యాంకింగ్‌లు మరియు మౌలిక వసతుల పబ్లిసిటీల ఆధారంగానే ఎక్కువగా కొలవబడుతోంది.దీనివలన భారతదేశ ప్రజలు నష్టపోతున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల యజమానులు లాభాలు పొందుతున్నారు.
ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలి. విద్యకు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించి, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, వసతి గృహాలు, డిజిటల్ సదుపాయాలను అభివృద్ధి చేయాలి. ప్రైవేట్ సంస్థల ఫీజులు, విరాళాలు, ప్రవేశాలు, ప్రకటనలపై కఠిన పర్యవేక్షణ ఉండాలి. ప్రతి జిల్లాలో స్వతంత్ర ఫీజు నియంత్రణ, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అవసరం.
ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత, నిరంతర శిక్షణ, అకడమిక్ స్వేచ్ఛ కల్పించాలి. విద్యార్థుల్లో కేవలం ఉద్యోగ నైపుణ్యాలే కాకుండా శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించే స్వభావం, ప్రజాస్వామ్య విలువలు, మానవత్వాన్ని పెంపొందించాలి.
విద్య కొద్దిమందికి ప్రత్యేక హక్కు కాదు. అది సమాజమంతా పంచుకునే సామూహిక సంపద. విద్యను వ్యాపారం నుంచి విముక్తి చేసి, విజ్ఞానం, సమానత్వం, మానవాభివృద్ధికి అంకితం చేయడమే నిజమైన జాతీయ పురోగతి.


