వేంసూరు /ఖమ్మం
ఖమ్మం జిల్లా, వేంసూరు మండలం
వేంసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ రూ.500 నోట్లను అసలైన కరెన్సీతో కలిపి చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 59 నకిలీ రూ.500 నోట్లు, ఏడు మొబైల్ ఫోన్లు, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 21న కందుకూరు గ్రామానికి చెందిన కిరాణా వ్యాపారిని మోసం చేసి రూ.18 వేల నగదు ఇచ్చి, అదే మొత్తాన్ని ఫోన్‌పే ద్వారా తమ ఖాతాకు బదిలీ చేయించుకున్నారు. అనంతరం బ్యాంకులో నగదు జమ చేసే సమయంలో 18 నకిలీ రూ.500 నోట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితులను గుర్తించి జూలై 30న అరెస్టు చేశారు.
విచారణలో ఆర్థిక ఇబ్బందులతో ఈజీ మనీ కోసం లారీ డ్రైవర్ మారం రమేష్, అతని సోదరుడు మారం మహేష్, రవీంద్ర తదితరులు నకిలీ కరెన్సీ సరఫరాదారులతో చేతులు కలిపినట్లు తేలింది. ప్రధాన నిందితుడు జుజ్జవరపు రవి, కాకినాడకు చెందిన కొవ్వూరి వినోద్ సతీష్ కుమార్ రెడ్డి ద్వారా భారీ మొత్తంలో నకిలీ నోట్లను తెప్పించి ఖమ్మం, సత్తుపల్లి, వేంసూరు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో చలామణి చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కేసును పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణలో దర్యాప్తు చేశారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చగా, కేసు దర్యాప్తు కొనసాగుతోంది.



