పార్లమెంటులో ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి
పున్నమి ప్రతినిధి ,తిరుపతి విద్య జూలై 28
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న మూడు విద్యా ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మంగళవారం లోక్‌సభ జీరో అవర్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
తిరుపతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నైలెట్) శాశ్వత క్యాంపస్ ఏర్పాటు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రతిపాదిత సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు ఆమోదం, తిరుపతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.తిరుపతిలో నైలెట్ కేంద్రం ఏర్పాటుకు మొదటి నుంచి తాను నిరంతరం కృషి చేశానని గురుమూర్తి గుర్తుచేశారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రిని పలుమార్లు కలిసి వినతులు సమర్పించడంతో పాటు పార్లమెంటులోనూ ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావించానని తెలిపారు. తన కృషి ఫలితంగానే తిరుపతిలో నైలెట్ కేంద్రం మొదలైందని పేర్కొన్నారు.ప్రస్తుతం శాశ్వత క్యాంపస్ కోసం భూకేటాయింపు, డీపీఆర్ సమర్పణ వంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వం, నైలెట్ యాజమాన్యం మధ్య చర్చల్లో ఉన్నాయని కేంద్రం ఇప్పటికే వెల్లడించిందని ఎంపీ సభ దృష్టికి తెచ్చారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి వీలైనంత త్వరగా శాశ్వత క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.
ఎస్వీ యూనివర్సిటీలో ప్రతిపాదిత సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు కేంద్రం తక్షణ ఆమోదం తెలిపి అమలు చర్యలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేంద్రం ఏర్పడితే దేశంలోనే అత్యాధునిక సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ టెక్నాలజీ పరిశోధనలకు తిరుపతి ప్రధాన కేంద్రంగా ఎదుగుతుందని ఆయన అన్నారు.
ఇదేవిధంగా తిరుపతి పార్లమెంటు పరిధిలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు అనువైన భూమిని ఇప్పటికే గుర్తించినప్పటికీ నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల గ్రామీణ, పేద విద్యార్థులు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. వెంటనే నిర్మాణ పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరారు.ఈ మూడు అంశాలపై ఇటీవల సంబంధిత కేంద్ర మంత్రులను వ్యక్తిగతంగా కలిసి వినతిపత్రాలు సమర్పించానని, ఇప్పుడు అదే అంశాలను జీరో అవర్‌లో మరోసారి ప్రస్తావించానని ఎంపీ గురుమూర్తి వివరించారు. విద్యా రంగంలో తిరుపతిని జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తన ప్రయత్నాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.


