సర్వేనెంబర్ 1580ఏలోని ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని మినీ స్టేడియానికి కేటాయించాలి: సిపిఐ(ఎంఎల్) లిబరేషన్
బద్వేల్, జూలై 25 (పున్నమి ప్రతినిధి):
చెన్నంపల్లి, బయనపల్లె, ఇమడాపురం రెవెన్యూ గ్రామాల పరిధిలోని ఆక్రమిత ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే చెన్నంపల్లి గ్రామ సర్వే నెంబర్ 1580ఏలో ఉన్న ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని మినీ స్టేడియం నిర్మాణానికి కేటాయించాలని కోరుతూ సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం బద్వేల్ మండల తహసీల్దార్ తిరుమల బాబుకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్. చంద్రశేఖర్ మాట్లాడుతూ, బద్వేల్–కడప ప్రధాన రహదారి వెంబడి ఉన్న చెన్నంపల్లి, బయనపల్లె, ఇమడాపురం రెవెన్యూ గ్రామాల పరిధిలోని విలువైన ప్రభుత్వ భూములు, రస్తాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు అధికార పార్టీ నాయకుల అనుచరులచే ఆక్రమణలకు గురవుతున్నాయని ఆరోపించారు.
చెన్నంపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 1567ఏ, 1569ఏ, 1580బి, 1753, 1755, 1569బి, బయనపల్లె పరిధిలోని 22, 23ఏ, 24ఏ, 26బి, 32బి, 33, అలాగే ఇమడాపురం పరిధిలోని సర్వే నెంబర్ 74బిలోని 1 ఎకరం 24 సెంట్లు, 148బిలో అక్రమంగా ఆన్లైన్ చేయించుకున్నట్లు పేర్కొన్న 1 ఎకరం 30 సెంట్ల భూములను పరిశీలించి, అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆస్తులను రక్షించాలని కోరారు.
బద్వేల్ ప్రాంతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు ప్రభుత్వ భూములపై ఇష్టారీతిన ఆక్రమణలకు పాల్పడుతున్నారని, అధికారుల ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అక్రమ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని, లేనిపక్షంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కే. జకరయ్య, నియోజకవర్గ కమిటీ సభ్యులు విజయరావు, రామరాజు, బాబు, సంజీవ రాయుడు, మహబూబ్ బాషా, చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు.


