
ఆత్మకూరు, జూలై 23 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని నెల్లూరుపాలెం సమీపంలో అక్రమ మట్టి రవాణాను స్థానికులు అడ్డుకున్న ఘటనను కవర్ చేసేందుకు వెళ్లిన రాజ్ న్యూస్ రిపోర్టర్ సురేష్‌పై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (ఏపీఎంఎఫ్) జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్రుడు, నాగిరెడ్డి, ఆత్మకూరు డివిజన్ కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు.
విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధిపై దాడి చేయడం హేయమైన చర్య అని వారు పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఇటువంటి ఘటనలను సహించబోమని స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి రిపోర్టర్ సురేష్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ తీర్మానం చేశారు. అనంతరం గాయపడిన సురేష్‌ను పరామర్శించి ఆయనకు సంఘం తరఫున పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో విధులు నిర్వహించే మీడియా ప్రతినిధులకు తగిన భద్రత కల్పించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసు శాఖను కోరారు.

