ఆక్వా రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ జీపీఎస్ (GPS) నిబంధనలతో సంబంధం లేకుండా అర్హులైన అందరికీ యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం తెలిపింది. గత రెండేళ్లలో రూ.1,543 కోట్ల విద్యుత్ సబ్సిడీ అందించామని వెల్లడించింది. కౌలు రైతులను కూడా సబ్సిడీ పరిధిలోకి తీసుకురావడంతో పాటు, 100 శాతం రాయితీగా సుమారు రూ.220 కోట్ల విద్యుత్ బిల్లులు భరించి, రొయ్యలు–చేపల రైతుల కోసం రూ.108 కోట్లను విడుదల చేసినట్లు పేర్కొంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మాట్లాడుతూ, ఆక్వా రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ విద్యుత్ సబ్సిడీని కొనసాగిస్తోందని తెలిపారు. రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.


