ఆత్మకూరు, జూలై 16 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని సంగం మండలం జంగాలకండ్రిక గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గంగపట్నం చంద్రశేఖరయ్య పెద్దకర్మ కార్యక్రమం గురువారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పార్టీ నాయకులు, అభిమానుల సమక్షంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు గూటూరు మురళీ కన్నబాబు హాజరై గంగపట్నం చంద్రశేఖరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా కొమ్మి లక్ష్మయ్య నాయుడు మాట్లాడుతూ, గంగపట్నం చంద్రశేఖరయ్య పార్టీ బలోపేతానికి, ప్రజా సేవకు విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ సేవాభావంతో పనిచేసిన నాయకుడిగా ఆయన చిరస్మరణీయులని అన్నారు. ఆయన వంటి అంకితభావం కలిగిన నాయకుడిని కోల్పోవడం పార్టీకి, ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. చంద్రశేఖరయ్య ఆశయాలను కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చల్లా రవికుమార్ రెడ్డి, మంతు వెంకటేశ్వర్లు రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొని గంగపట్నం చంద్రశేఖరయ్యకు ఘనంగా నివాళులర్పించారు.


