జవహర్ నగర్, మేడ్చల్ జిల్లా:
తేదీ: 11 జూలై, 2026
జవహర్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజల పాలిట శాపంగా మారిన డంప్ యార్డ్ భూతాన్ని ఇక్కడి నుండి తరిమేయాలంటూ స్థానిక ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉమ్మడిగా చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దశాబ్దాలుగా కాలుష్య కోరల్లో చిక్కుకుని, రోగాల బారిన పడుతున్న ప్రజా గొంతుకలను వినాల్సింది పోయి.. ప్రభుత్వం పోలీసు బలగాలతో అణిచివేసే ప్రయత్నం చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఘటన వివరాల్లోకి వెళ్తే..
కాలుష్యంతో రోజురోజుకూ నరకం చూస్తున్న జవహర్ నగర్ వాసులు, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ నేడు ఉదయం “గో బ్యాక్ డంప్ యార్డ్” నినాదంతో భారీ నిరసనకు దిగారు. డంప్ యార్డ్‌కు నగరంలోని వివిధ ప్రాంతాల నుండి చెత్తను తరలించే లారీలను జవహర్ నగర్ సరిహద్దుల్లోనే నిలిపివేసేందుకు (రాస్తారోకో) ఉద్యమకారులు, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చారు.
సమాచారం ముందుగానే అందుకున్న పోలీసులు ఉదయం నుంచే భారీగా మోహరించి, లారీల రాకపోకలకు అడ్డుపడకుండా నిరసనకారులను అడ్డుకున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నాయకులను, స్థానికులను బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లోకి ఎక్కించారు.
పోలీస్ స్టేషన్లో అపొజిషన్ లీడర్లు:
ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా గళమెత్తిన వివిధ పార్టీల ముఖ్య నేతలను మరియు సామాజిక కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో:
శ్రీ కోటేష్ గౌడ్ (కాంగ్రెస్ పార్టీ మాజీ మేయర్ భర్త)
శ్రీ శంకర్ గౌడ్ (మాజీ సర్పంచ్)
శ్రీమతి లలిత యాదవ్ ( తెరాస పార్టీ స్టేట్ ఫౌండర్)
శ్రీ లక్ష్మినారాయణ (బీజేపీ తెలంగాణ OBC లీడర్)
శ్రీ సందీప్ (నవోదయ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ & OBC ఛానల్ రిపోర్టర్)
మీడియాపైనా ఆంక్షలు.. ప్రజల ఆగ్రహం!
ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న OBC ఛానల్ రిపోర్టర్, సామాజిక వేత్త అయిన సందీప్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం ఇక్కడ గమనార్హం. ప్రజా సమస్యలను ప్రతిబింబించే మీడియా గొంతు నొక్కడమేనని స్థానికులు మండిపడుతున్నారు.
ప్రజల డిమాండ్:
“పాలకులకు ఇక్కడి ప్రజల ప్రాణాల కంటే చెత్త కుప్పలే ముఖ్యమా? కాలుష్యంతో మా పిల్లలు, వృద్ధులు రోగాల బారిన పడుతుంటే ప్రశ్నించే హక్కు కూడా మాకు లేదా? అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు. జవహర్ నగర్ డంప్ యార్డ్‌ను తక్షణమే ఇక్కడి నుండి తరలించాల్సిందే.” అని స్థానిక మహిళలు, యువకులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం జవహర్ నగర్ ప్రాంతంలో అప్రకటిత లాక్డౌన్ వాతావరణం నెలకొంది. పోలీస్ స్టేషన్ వద్దకు కూడా ప్రజలు భారీగా చేరుకుంటుండటంతో పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది.







