ఖమ్మం:
(పున్నమి న్యూస్ )
ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వారాహి పెస్టిసైడ్స్ సంస్థను బీజేపీ రాష్ట్ర నాయకులు, ఖమ్మం లోక్‌సభ కంటెస్టెడ్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం కేవలం దిగుబడులు పెంచే ప్రక్రియ మాత్రమే కాదని, ప్రజల ఆరోగ్యాన్ని నిర్ణయించే బాధ్యత కూడా రైతులపై ఉందన్నారు. మనం తీసుకునే ఆహారం ఆరోగ్యంగా ఉండాలంటే, ఆ ఆహారాన్ని పండించే నేల ఆరోగ్యంగా ఉండాలని పేర్కొన్నారు.
భూమిలో సేంద్రియ కార్బన్ శాతం తగ్గిపోవడం, రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం వల్ల నేల సారం క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నేల ఆరోగ్యం దెబ్బతింటే రైతు ఆదాయం, పంట నాణ్యతతో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందని అన్నారు.
జీవ ఎరువులు, జీవ పురుగుమందులు భవిష్యత్ వ్యవసాయానికి ఎంతో అవసరమని ఆయన తెలిపారు. ఇవి నేలలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులను సంరక్షించి భూమి సారాన్ని పెంచడంతో పాటు రైతుల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడతాయని చెప్పారు.
రైతులు ఒక్కసారిగా మొత్తం పొలంలో మార్పులు చేయకుండా ముందుగా కొంత విస్తీర్ణంలో జీవ ఉత్పత్తులను వినియోగించి ఫలితాలను పరిశీలించిన తర్వాత క్రమంగా విస్తరించాలని సూచించారు. “మనకు అన్నం పెట్టే భూమిని కాపాడటం అంటే మన పిల్లల భవిష్యత్తును కాపాడినట్లే” అని తాండ్ర వినోద్ రావు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, శ్యామ్ రాథోడ్, నాగేశ్వరరావు, సీతారాం నాయక్, వేణు, వేల్పుల సుధాకర్, అనంతు ఉపేందర్, వెంకటనారాయణ, క్రాంతి, డీకొండ శ్యామ్, బుడగం రవి తదితరులు పాల్గొన్నారు.



