ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సాధనలో భాగంగా చేపట్టిన చలో సోమశిల కార్యక్రమంలో భాగంగా గురువారం సోమశిల జలాశయాన్ని సందర్శించేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. డ్యాం పైకి వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులతో కలిసి సోమశిల జలాశయం సందర్శనకు వచ్చారు. అయితే డ్యాం పైభాగానికి వెళ్లేందుకు పోలీసులు కార్యకర్తలను అనుమతించలేదు. ముందుగా కొంతమంది ముఖ్య నాయకులకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమైంది.
పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మాత్రమే జలాశయం పైకి అనుమతించడంతో మిగిలిన నాయకులు, కార్యకర్తలు పోలీసుల తీరుపై నిరసన తెలిపారు. ప్రజా సమస్యలపై చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరికాదంటూ నినాదాలు చేశారు.
అనంతరం జరిగిన సభలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలపై పోరాటం చేయడం ప్రతిపక్షాల బాధ్యత అని అన్నారు. ప్రజల తరఫున, ప్రజల కోసం చేపడుతున్న కార్యక్రమాలను పోలీసులు ఉపయోగించి అడ్డుకోవడం సరైన విధానం కాదని విమర్శించారు.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా నెల్లూరు జిల్లాకు కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకే చలో సోమశిల కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఇలాంటి ప్రజా ఉద్యమాలను అడ్డుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావని, ప్రభుత్వం ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు.అయితే సోమశిల జలాశయం వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకోవడంతో భద్రతా కారణాలు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే పోలీసులు కార్యకర్తలను నిలుపుదల చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.చివరకు కొంతమంది ముఖ్య నాయకులు మాత్రమే సోమశిల జలాశయాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. కాగా, ఈ ఘటనతో కొద్దిసేపు సోమశిల వద్ద రాజకీయ వాతావరణం వేడెక్కింది.


