ఫ్యూచర్ సిటీలో వికారాబాద్ జిల్లా సరిహద్దు గ్రామాలు !
భారీగా పెరగనున్న భూముల రేట్లు…!
స్థానిక యువతకు ఉద్యోగాలు వచ్చి అవకాశం
815 చదరపు కిలోమీటర్ల పరిధిలో నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు
తెలంగాణను ఆర్థికంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంతో పాటు, హైదరాబాద్‌కు నాల్గవ నగరంగా రూపుదిద్దుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు పరిధిని మరింత పెంచుతూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట్ పరిసరాల్లో నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన సమయంలో సీఎం.. ఈ మెగా నెట్-జీరో సిటీ పరిధిలోకి సమీపంలోని మరికొన్ని గ్రామాలను విలీనం చేసే ఫైలుపై సూత్రప్రాయ ఆమోదం తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల సరిహద్దుల్లోని పలు పంచాయతీలు, స్థానిక రైతుల నుంచి వచ్చిన భారీ విజ్ఞప్తుల మేరకే ప్రభుత్వం ఈ అడుగు వేసింది.
ఈ పరిధి విస్తరణ నిర్ణయంతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతాలలోని గ్రామీణ సాగు భూముల మార్కెట్ విలువకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ఒకప్పుడు హైదరాబాద్ కేవలం ఐటీ కారిడార్‌కే పరిమితమైంది.. కానీ ఇప్పుడు రంగారెడ్డి, దాని పరిసర జిల్లాల భూములు బంగారం కంటే విలువైవుగా మారాయి అని సీఎం రేవంత్ స్వయంగా ప్రకటించడంతో ల్యాండ్ వాల్యూస్ నూతన రికార్డులను సృష్టిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు సాధారణ వ్యవసాయ ధరలు పలికిన ఎకరాల భూములు.. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అథారిటీ పరిధిలోకి రాబోతున్నాయనే ప్రచారంతో కోట్లలోకి చేరాయి. జాతీయ స్థాయి రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఈ సరిహద్దు గ్రామాల్లో ల్యాండ్ బ్యాంకులు సేకరించేందుకు క్యూ కడుతున్నారు.
న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి అంతర్జాతీయ నగరాల సరసన నిలిచేలా రాబోయే ఎనిమిదేళ్లలో ఈ గ్రీన్ మెట్రోపాలిస్‌ను నిర్మిస్తామని ప్రభుత్వం పదే పదే చెప్తుండటం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది. గ్రీన్ ఫార్మా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌లతో పాటు ప్రపంచ ప్రఖ్యాత ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఇక్కడికి రప్పించేందుకు డిసెంబర్‌లో భారీ గ్లోబల్ సమ్మిట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, కేవలం హైదరాబాద్ శివార్లకే పరిమితం కాకుండా వికారాబాద్ సరిహద్దుల వరకు ఈ సిటీ ప్రభావం విస్తరిస్తుండటంతో దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఇదొక సువర్ణావకాశంగా రియాల్టీ నిపుణులు అభివర్ణిస్తున్నారు.
స్థానిక యువతకు ఉద్యోగాల భరోసా!
ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని చూసే ప్రతిపక్షాలకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదంటూ సీఎం రేవంత్ రెడ్డి గట్టి హెచ్చరికలు జారీ చేయడం.. ఈ సిటీ నిర్మాణంపై ప్రభుత్వం ఎంత పట్టుదలగా ఉందో స్పష్టం చేస్తోంది. భూములిచ్చిన స్థానిక రైతు కుటుంబాల యువతకు రీజనల్ స్కిల్ యూనివర్సిటీ ద్వారా అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇచ్చి, ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. కాలుష్య రహిత, పర్యావరణ అనుకూల లేక్ ఎకానమీ మోడల్‌లో ఈ నగరం రూపుదిద్దుకోనుండటంతో.. కేవలం కమర్షియల్ వెంచర్లకే కాకుండా లగ్జరీ ఫామ్‌హౌస్‌లు, గేటెడ్ విల్లా ప్రాజెక్టులకు ఈ రంగారెడ్డి-వికారాబాద్ సరిహద్దు బెల్ట్ అత్యంత హాట్ స్పాట్‌గా మారుతుందని అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రస్తుతం నెమ్మదిగా పట్టాలు ఎక్కుతుంది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్ నిర్మాణం పూర్తి కాగా, ఫ్యూచర్ సిటీ నిర్మాణ పనులు శరవేగంతో ముందుకు వెళుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే గ్రీన్ ఫీల్డ్ రోడ్స్, దీంతోపాటు పలు ప్రైవేట్ సంస్థలు సైతం తమ ప్రతిపాదిత ప్రాజెక్టులను వేగంగా ప్రారంభిస్తున్నాయి. ఫ్యూచర్ సిటీ కారణంగా హైదరాబాద్లోని తూర్పు వైపు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ రంగం విస్తరిస్తుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా శ్రీశైలం హైవే, నాగార్జునసాగర్ హైవే మధ్య ప్రాంతంలో విస్తరించిన ఈ ఫ్యూచర్ సిటీ అటు ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందనుంది. అటు ఫ్యూచర్ సిటీకి సమీపంలోనే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉన్న నేపథ్యంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములకు డిమాండ్ ఏర్పడింది అని చెప్పవచ్చు. అయితే ఫ్యూచర్ సిటీలో పెట్టుబడి పెట్టాలి అనుకునేవారు ప్రస్తుతం ఎక్కువగా మహేశ్వరం కేంద్రంగా పెట్టుబడులు పెడుతున్నారు. మహేశ్వరం ప్రాంతం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటంతో పాటు, భూముల లభ్యత కూడా ఎక్కువగా ఉంది. హైదరాబాదులోని పశ్చిమ ప్రాంతంతో పోల్చి చూస్తే మహేశ్వరం ప్రాంతం తక్కువగా అభివృద్ధి చెందింది. ఓల్డ్ సిటీ ఛాయను కూడా ఉండటం వల్ల అభివృద్ధి కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం మాత్రం శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో మహేశ్వరం భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ మార్కెట్ కు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట వద్ద ఫ్యూచర్ సిటీకోసం మరో 16 వేల ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతోపాటు దాని అభివృద్ధి కోసం ప్రత్యేకించి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఫ్యూచర్‌సిటీ కోసం ప్రభుత్వం ఓవైపు వడివడిగా అడుగులు వేస్తున్నది. ఫార్మాసిటీ కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 14 వేల ఎకరాలను సేకరించింది. ఆ భూమిని ఫ్యూచర్ సిటీకి వాడుకోగా, 16 వేల ఎకరాలు అదనంగా అవసరం ఉండ టంతో కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లో సేకరించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నది. ఫ్యూచర్ సిటీని 815 చదరపు కిలోమీటర్ల పరిధిలో నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాల పరిధిలోని 30 వేల ఎకరాల్లో సుమారు 815 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఏడు మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాలు 74 గ్రామాల పరిధిలో ఈ ఫ్యూచర్‌సిటీ విస్తరించే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్ధంచేశారు. వికారాబాద్ జిల్లా సరిహద్దు లో ఉన్న మరికొన్ని గ్రామాలను ఫ్యూచర్ సెట్ లో కలపన్నారు. ఇప్పటికే యాచారం మండలం మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలతోపాటు కందుకూరు మండలం ఆకులమైలారం, ముచ్చర్ల, పంజాగూడ, మీరఖాన్‌పేట్, తదితర గ్రామాల్లో 14 వేల ఎకరాల భూములను సేకరించారు.




