శ్రీ కాళహస్తి, జూన్ 20, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఘన విజయం సాధించాలని, రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన కొనసాగాలని కోరుతూ చేసిన మొక్కును తీర్చుకునేందుకు ఆయన సతీమణి బొజ్జల లలిత శనివారం తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యాత్రను చేపట్టినట్లు తెలిపారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు స్వగ్రామమైన ఊరందూరు నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో టిడిపి నాయకులు, తెలుగు మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మార్గమంతా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, మహిళలు బొజ్జల లలితకు ఘన స్వాగతం పలుకగా, జై బొజ్జల నినాదాలతో పాదయాత్ర ఉత్సాహభరితంగా కొనసాగింది. పాదయాత్ర సాగిన ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది.




