పున్నమి ప్రతినిధి ,తిరుపతి, జూన్ 19.2026
భగవంతుడిని భక్తుని వద్దకు చేర్చి, సనాతన ధర్మ కాంతిని ప్రతి పల్లెకు వ్యాపింపజేయాలనే దివ్య సంకల్పంతో, రాయలచెరువు శ్రీ శక్తి పీఠం ఆధ్వర్యంలో వాడవాడలా వారాహీ ప్రచార రథయాత్ర శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. కుర్తాళం పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి ఆశీస్సులతో, శ్రీ శక్తిపీఠాధీశ్వరి శ్రీ శ్రీ శ్రీ రమ్యానంద భారతీ మహాస్వామిని వారు దీనికి శ్రీకారం చుట్టారు. భక్తులను దివ్య మాతృమూర్తికి చేరువ చేయడం, వారిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొల్పడం, ధర్మప్రచారమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీకాంత్ ఆచార్య, మేనేజర్ ప్రసాద్ ఆధ్వర్యంలో సాగిన రథం ఈరోజు తుమ్మలగుంట, విద్యానగర్, పేరూరు మీదుగా చంద్రగిరి శ్రీ మూలస్థాన ఎల్లమ్మ దేవాలయం చేరగా, చైర్మన్ శ్రీ మొక్కల చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అర్చకులు శ్రీ వారాహి దేవి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని, తుడా చైర్మన్ డాక్టర్ దివాకర్ రెడ్డి గార్లను కలిసి తీర్థప్రసాదాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ — మహిమాన్వితమైన శ్రీ వారాహి అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీ తాళ్లపాక పెదగంగమ్మ గుడి వద్ద ప్రచారం నిర్వహించగా, శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం EO శ్రీ జయ కుమార్ గారు అమ్మవారి పూజలో పాల్గొన్నారు.
ఈ ధర్మప్రచార యాత్ర తుది గమ్యంగా — సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పవిత్ర శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాలు ఆషాఢ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు (జూలై 15–25) శ్రీ శక్తి పీఠంలో వైభవంగా జరగనున్నాయి. భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలను పొందాలని నిర్వాహకులు కోరారు.




