పున్నమి: రంగారెడ్డి జిల్లా: హర్షం వ్యక్తం చేస్తున్న పార్టీ శ్రేణులు,ప్రజా,దళిత సంఘాలు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)లో సంస్థాగత నియామకాల ప్రక్రియలో భాగంగా ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీలో కీలక నియామకం జరిగింది. పార్టీ అధిష్టానం, మనకొండూరు శాసనసభ్యులు, టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సిఫార్సు మేరకు డాక్టర్ ఉక్కుల అశోక్‌ను టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా ఉక్కుల అశోక్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టానానికి, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయంగా ఎల్లప్పుడూ తనకు మార్గనిర్దేశం చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే డాక్టర్ మల్‌రెడ్డి రంగారెడ్డికి, అలాగే ఈ అవకాశం దక్కడంలో సహకరించిన అంకిత్ హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ అనురాధకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మల్‌రెడ్డి రంగారెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఉక్కుల అశోక్, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ, టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమితులైన ఉక్కుల అశోక్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు చేరువై సేవలందించాలని సూచించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
తనకు అప్పగించిన పదవిని గౌరవంగా కాకుండా బాధ్యతగా స్వీకరిస్తున్నానని ఉక్కుల అశోక్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనతో పాటు ఎస్సీ వర్గాల హక్కులు, సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. సామాజిక న్యాయం సాధనకు అలుపెరగని పోరాటం చేస్తూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, యాచారం మండల మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, డీసీసీ ఉపాధ్యక్షులు ముత్యాల రాజశేఖర్ రావు, ఆదిభట్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ హరిత ప్రవీణ్ గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు జోగు శేఖర్, నాయకులు ఉడుతల రవి గౌడ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఉక్కుల అశోక్‌కు రాష్ట్ర స్థాయి పదవి దక్కడంపై ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నాయకత్వంలో పార్టీ కార్యక్రమాలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.



