యాచారం పోలీసుల తీరుపై కవుల సరస్వతి ఆగ్రహం
ముందస్తు నోటీసులు లేకుండా అక్రమ అరెస్ట్ చేశారని ఆరోపణ
మహిళా హక్కులను కాలరాసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
యాచారం, జూన్ 10 (పున్నమి న్యూస్ ): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్:
ముఖ్యమంత్రి పర్యటన పేరుతో యాచారం పోలీసులు తనను చట్టవిరుద్ధంగా నిర్బంధించి తీవ్ర మానసిక ఇబ్బందులకు గురి చేశారని సామాజిక కార్యకర్త కవుల సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, చట్ట ప్రక్రియలను పాటించకుండా ప్రివెంటివ్ అరెస్ట్ పేరుతో పోలీసులు వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమని ఆమె ఆరోపించారు.
ఈ రోజు ఉదయం సుమారు 9 గంటల సమయంలో తన సోదరి మరియు వృద్ధురాలైన తల్లితో కలిసి నందివనపర్తి గ్రామంలోని నివాసం నుండి హైదరాబాద్‌కు బయలుదేరుతుండగా యాచారం పోలీసులు అకస్మాత్తుగా ఇంటి వద్దకు చేరుకున్నారని తెలిపారు. అనంతరం “ప్రివెంటివ్ అరెస్ట్” చేస్తున్నామని ప్రకటిస్తూ తమను అడ్డుకున్నారని పేర్కొన్నారు. దీనిపై తాను ఎటువంటి నోటీసులు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించగా, యాచారం సీఐ నందీశ్వర్ దురుసుగా ప్రవర్తిస్తూ స్టేషన్‌కు రాకపోతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని బెదిరించారని ఆరోపించారు.
తనతో పాటు ఉన్న వృద్ధురాలైన తల్లి తీవ్ర ఆందోళనకు గురవుతుందని చెప్పినా పోలీసులు కనికరం చూపలేదని సరస్వతి వాపోయారు. ప్రయాణానికి వచ్చిన క్యాబ్ డ్రైవర్‌ను కిందికి దింపి, అతని స్థానంలో కానిస్టేబుల్‌ను కారులో ఎక్కించి బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలిపారు. మార్గమధ్యంలో తన మొబైల్ ఫోన్‌ను కూడా లాక్కొని, ఎవరితోనూ మాట్లాడనీయకుండా వ్యవహరించారని ఆమె పేర్కొన్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న కమిటీ సభ్యులు ముత్యాల వెంకట్ రెడ్డి, బొడ్డు సందీప్, శ్రీకాంత్ నాయక్ మరియు స్థానిక రైతులు వెంటనే స్పందించి ఏసీపీ రాజుకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న ఏసీపీ రాజు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సీఐ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి మందలించడంతో పోలీసులు చివరకు సరస్వతిని విడుదల చేసినట్లు సమాచారం.
అయితే స్టేషన్ నుండి పంపించిన తరువాత కూడా పోలీసులు తమ వేధింపులను ఆపలేదని సరస్వతి ఆరోపించారు. చట్టవిరుద్ధంగా ఒక పోలీస్ పెట్రోల్ వాహనాన్ని తన వెనుక పంపిస్తూ నిరంతరం నిఘా పెట్టారని, దీనివల్ల తాను తీవ్ర భయాందోళనలకు గురయ్యానని అన్నారు. ఒక మహిళా సామాన్య పౌరురాలిపై ఈ తరహా నిఘా, వెంబడింపు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మండిపడ్డారు.
మహిళా హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛలను కాలరాసే విధంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కవుల సరస్వతి డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఆమె కోరారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాల్సిన పోలీసులు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య ప్రజలపై ఒత్తిడి తీసుకురావడం, బెదిరింపులకు పాల్పడడం సరైన విధానం కాదని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.





