ఆత్మకూరు డివిజన్లో ప్రత్యేక డ్రగ్స్ టెస్టింగ్ కిట్లతో తనిఖీలు – గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచన
ఆత్మకూరు, జూన్ 8 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
మత్తు పదార్థాలు, గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసు శాఖ మరింత కఠిన చర్యలు చేపడుతోందని ఆత్మకూరు సీఐ గంగాధర్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల ఆదేశాలు, ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ సూచనల మేరకు ఆత్మకూరు డివిజన్ పరిధిలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించే వారిని గుర్తించేందుకు ప్రత్యేక డ్రగ్స్ టెస్టింగ్ కిట్లను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఎస్సై జంపాని కుమార్‌తో కలిసి సోమవారం మీడియాతో మాట్లాడిన సీఐ గంగాధర్, డ్రగ్స్ టెస్టింగ్ కిట్ల ద్వారా అనుమానితులను పరీక్షిస్తున్నామని తెలిపారు. ఈ పరీక్షల్లో మత్తు పదార్థాల వినియోగం నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ సందర్భంగా సీఐ గంగాధర్ మాట్లాడుతూ, ఆత్మకూరు డివిజన్ పరిధిలో మొత్తం 50 ప్రత్యేక డ్రగ్స్ టెస్టింగ్ కిట్లను అందించగా, ఆత్మకూరు సర్కిల్ పరిధికి 16 కిట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటికే ఆత్మకూరులో ఏడుగురికి ఈ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించామని, వారందరికీ నెగటివ్ ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.గంజాయి నిర్మూలన చర్యల్లో భాగంగా ఈ ప్రత్యేక కిట్లను ఉపయోగిస్తున్నామని, మత్తు పదార్థాల ప్రభావంతో నేరాలకు పాల్పడుతున్నారనే అనుమానం ఉన్న వ్యక్తులను కూడా పరీక్షిస్తున్నామని చెప్పారు. డ్రగ్స్ వినియోగంపై సమాచారం అందిన వెంటనే ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.డ్రగ్స్ టెస్టులో పాజిటివ్‌గా తేలిన వారిపై ప్రత్యేక విచారణ చేపట్టి, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత ముఖ్యంగా గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబాలు, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఈ తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని సీఐ గంగాధర్ స్పష్టం చేశారు. ప్రజలు కూడా మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.


