రూ. లక్ష విరాళంతో ఆస్పత్రి అభివృద్ధికి చేయూతనిచ్చిన కంచి
ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రాంతీయ పశు వైద్యశాల సోమవారం పునః ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శిథిలావస్థకు చేరుకున్న ఆస్పత్రి కిటికీల మరమ్మత్తుల కోసం ప్రముఖ దాత, శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, నిత్యాన్నదాత శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి రూ.1,00,000 విరాళం అందజేయడంతో ఆస్పత్రికి నూతన రూపు తీసుకొచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కంచి పరమేశ్వర రెడ్డి రిబ్బన్ కట్ చేసి పశు వైద్యశాలను పునః ప్రారంభించారు. ఆత్మకూరు ప్రాంతీయ పశు వైద్యశాల ఏడీ డాక్టర్ సి.వి. రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పశు వైద్యాధికారులు, సిబ్బంది, రైతు సోదరులు హాజరయ్యారు.కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను పుష్పగుచ్ఛాలతో ఘనంగా స్వాగతించి వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం ఆస్పత్రి అభివృద్ధికి భారీ విరాళం అందించిన కంచి పరమేశ్వర రెడ్డిని డాక్టర్ సి.వి. రెడ్డి బృందం, జిల్లా అధికారులు శాలువా, గజమాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన పశు వైద్యాధికారులు, శిథిలావస్థలో ఉన్న ఆస్పత్రికి పూర్వవైభవం తీసుకురావడానికి డాక్టర్ సి.వి. రెడ్డి బృందం అహర్నిశలు కృషి చేసిందని ప్రశంసించారు. అలాగే మూగజీవుల సేవ కోసం కంచి పరమేశ్వర రెడ్డి అందించిన రూ.లక్ష విరాళం ఆయనకు పశువులపై ఉన్న ప్రేమ, అంకితభావానికి నిదర్శనమన్నారు.ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులకు నిరంతరం అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్న కంచి పరమేశ్వర రెడ్డి సేవలను అధికారులు కొనియాడారు. ప్రజాసేవలో ఆయన చేస్తున్న కార్యక్రమాలు సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు.అనంతరం మాట్లాడిన కంచి పరమేశ్వర రెడ్డి, ఆస్పత్రి అభివృద్ధిలో తనను భాగస్వామ్యం చేసినందుకు డాక్టర్ సి.వి. రెడ్డి, రైతులకు ధన్యవాదాలు తెలిపారు. “మనుషులమైతే తమ బాధను డాక్టర్లకు చెబుతాం. కానీ మూగజీవుల బాధను గుర్తించి వాటికి వైద్యం అందించే పశు వైద్యుల సేవలు ఎంతో గొప్పవి” అని కొనియాడారు.డాక్టర్ సి.వి. రెడ్డి అంకితభావంతో పనిచేయడం వల్లే జిల్లా నలుమూలల నుంచి రైతులు ఇక్కడికి వస్తున్నారని, ఇక్కడి వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందన్నారు.కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో కలిసి పశు వైద్యశాలల అభివృద్ధి, రైతుల సంక్షేమంపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అలాగే కార్యక్రమానికి హాజరైన అధికారులు, రైతులు, ప్రజలందరికీ శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు.


