కొండెక్కిన కోడి ధరలు కూల్… చికెన్ ప్రియులకు ఊరట!
భారీగా తగ్గిన ధరలు – మార్కెట్లో చురుకైన అమ్మకాలు
ఇటీవలి కాలంలో ఆకాశాన్నంటిన కోడి మాంసం ధరలు చివరకు తగ్గుముఖం పట్టాయి. ఒకప్పుడు కిలోకు రూ.360 నుంచి రూ.400 వరకు పలికిన బ్రాయిలర్ చికెన్ ధరలు ఇప్పుడు గణనీయంగా తగ్గి, ప్రస్తుతం మార్కెట్లో సుమారు రూ.270కి లభిస్తున్నాయి. ఈ పరిణామం చికెన్ ప్రియులకు పెద్ద ఊరటనిచ్చింది.
గత కొన్ని వారాలుగా పెరిగిన వేసవి ఉష్ణోగ్రతలు కోళ్ల పెంపకంపై తీవ్ర ప్రభావం చూపించాయి. అధిక వేడి కారణంగా కోళ్లు చనిపోవడం, దాణా ఖర్చులు పెరగడం వల్ల పౌల్ట్రీ యజమానులు ధరలను పెంచాల్సి వచ్చింది. అదే సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు పెరగడంతో చికెన్‌కు భారీ డిమాండ్ ఏర్పడి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
దీంతో వినియోగదారులు చికెన్ కొనడంలో వెనుకడుగు వేసి, చాలా మంది సీ ఫుడ్ వైపు మొగ్గు చూపారు. కానీ, పరిస్థితులు క్రమంగా మారడంతో గతవారం నుంచే ధరలు తగ్గడం ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో స్కిన్‌లెస్ చికెన్ ధర సుమారు రూ.270గా కొనసాగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం ప్రాంతంలో మాత్రం రూ.300 నుంచి రూ.350 మధ్యలో అమ్మకాలు జరుగుతున్నాయి.
ఉష్ణోగ్రతల్లో మార్పులు, కోళ్ల లభ్యత, పెంపకం పరిస్థితులు వంటి అంశాలపై ఆధారపడి చికెన్ ధరలు మారుతుంటాయని వ్యాపారులు చెబుతున్నారు. వచ్చే రోజుల్లో ధరలు మరింత స్థిరపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు🙏


