డ్రగ్స్ వద్దు బ్రో”… యువతకు అవగాహన కల్పిస్తున్న నెల్లూరు పోలీసులు
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం **“ఆపరేషన్ వజ్ర ప్రహార్”**లో భాగంగా జిల్లాను డ్రగ్ ఫ్రీగా మార్చడమే లక్ష్యంగా నెల్లూరు పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల, IPS ఆదేశాలు మేరకు అడిషనల్ ఎస్‌పి (అడ్మిన్) సౌజన్య సూచనలతో స్కూల్స్, కళాశాలల్లో కార్యక్రమాలు చేపడుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 988 ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసి, రైల్వే, ఎక్సైజ్, డ్రగ్స్ విభాగాలతో సమన్వయంగా “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో అవగాహన కల్పిస్తున్నారు. అదనంగా 24 డ్రోన్లతో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారిని రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలించి, జిల్లాలోని రెండు డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్ అందిస్తున్నారు. గంజాయి వంటి డ్రగ్స్ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై కలిగే దుష్పరిణామాలు, నేరచరిత్రపై పడే ప్రభావాల గురించి విద్యార్థులకు వివరించారు.
డ్రగ్స్ అక్రమ రవాణాతో పాటు వినియోగం కూడా నేరమేనని, వాడిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా, వినియోగించినా డయల్ 112 లేదా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.



