ఖమ్మం, మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
అంబేద్కర్ భవన్ ఆవరణంలో ఆశ్రయం పొందుతున్న వెలుగుమట్ల భూ నిర్వాసితులను ధర్నా పేరిట రెచ్చగొట్టి, ఎటువంటి అనుమతులు లేకుండా జిల్లా పరిషత్ సెంటర్ వద్ద మూడు గంటలపాటు రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించిన ఘటనలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత
ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజుతో పాటు మొత్తం 43 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు.
వెలుగుమట్ల భూ నిర్వాసితులను తప్పుదోవ పట్టించి ధర్నాకు దిగేలా ప్రేరేపించి, రోడ్డుపై బైఠాయించడం వల్ల ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు వారించినప్పటికీ ఆందోళనకారులు వినకుండా దౌర్జన్యంగా ప్రవర్తించి పోలీసు విధులకు ఆటంకం కలిగించారని వెల్లడించారు.
ఈ కేసులో ఉన్న 43 మందిలో ఖమ్మం జిల్లాకు సంబంధం లేని 33 మంది నిజామాబాద్, వనపర్తి, నల్గొండ, కామారెడ్డి, హన్మకొండ, హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన బయట వ్యక్తులని తెలిపారు. వారు అంబేద్కర్ భవన్‌లో ఉన్న బాధితులను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ స్పష్టం చేశారు.
అదేవిధంగా కొంతమంది భూ నిర్వాసితులు విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీస్ సిబ్బందిపై దాడులు చేసినట్లు ప్రాథమిక సమాచారం ఉందని తెలిపారు. సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను పరిశీలించిన అనంతరం సంబంధిత వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు చెప్పారు.
భూ నిర్వాసితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొంతమంది రెచ్చగొట్టే మాటలను నమ్మి మోసపోవద్దని ఏసీపీ విజ్ఞప్తి చేశారు..



