అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది కేవలం ఉత్సవాలకు, ఆటపాటలకు పరిమితం కావాల్సిన రోజు కాదని, అది మహిళల సమాన హక్కుల కోసం సాగిన చారిత్రాత్మక పోరాటాలకు ప్రతీక అని భారత విప్లవ మార్క్సిస్ట్ పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ దాసరి జయచంద్ర పేర్కొన్నారు. ఆదివారం రైల్వే కోడూరులో ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జయచంద్ర మాట్లాడుతూ.. మహిళా దినోత్సవ పోరాట స్ఫూర్తిని పాలకవర్గాలు వక్రీకరిస్తూ కేవలం రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలహీనులుగా ఉంచే విధానాలను అమలు చేస్తూ వారి అభ్యుదయ ఆలోచనలను నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. మహిళల అసలు సమస్యలైన భద్రత, ఉపాధి, సమాన వేతనంపై ప్రభుత్వాలకు స్పష్టమైన కార్యాచరణ లేదని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో మహిళలపై హింసాత్మక ఘటనలు, అత్యాచారాలు పెరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, పైగా అధికార ప్రజాప్రతినిధులే తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి మహిళా ఉద్యోగులను వేధింపులకు గురిచేయడం అత్యంత సిగ్గుచేటని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్-6 హామీల్లో భాగమైన ‘ఆడబిడ్డ నిధి’ పథకాన్ని ఇప్పటికీ అమలు చేయకపోవడం ద్వారా ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన మాట తప్పిందని జయచంద్ర విమర్శించారు. మహిళల స్వాభిమానం కోసం కేవలం హామీలు కాకుండా స్పష్టమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. మహిళల గౌరవం, విముక్తి కోసం సాగుతున్న ప్రతి ఉద్యమానికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఏఐడీడబ్ల్యూఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు భాగ్యమ్మ, సౌజన్య, కోశాధికారి సుజాత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పంచాయతీ మహిళా కార్మికులు, ప్రైవేట్ టీచర్స్ యూనియన్ నాయకురాలు మరియు మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



