ఖమ్మం, జనవరి
(పున్నమి దిన పత్రిక జిల్లా ప్రతినిధి)
పెనుబల్లి మండలంలోని లంకపల్లి క్లస్టర్ పరిధిలో గురువారం ‘సీయం కప్’ గ్రామ స్థాయి క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి శాసనసభ్యురాలు శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ గారు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.
లంకపల్లి క్లస్టర్ పరిధిలోని లంకపల్లి, క్రొత్త లంకపల్లి, మండాలపాడు, ఎరుగట్ల, రామచంద్రాపురం గ్రామ పంచాయతీలకు చెందిన క్రీడాకారుల మధ్య ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే గారు వాలీబాల్ క్రీడను ప్రారంభించి, స్వయంగా క్రీడాకారులతో కలిసి ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, జీవితంలో గెలుపు–ఓటములు సహజమని, ఓటమిని పాఠంగా తీసుకుని గెలుపును ప్రేరణగా మలుచుకోవాలని క్రీడాకారులకు సూచించారు. చదువుతో పాటు శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొన్న యువతకు, క్రీడాకారులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో క్లస్టర్ పరిధిలోని నూతన సర్పంచ్లు పాల్గొనగా, ఎమ్మెల్యే గారు వారిని శాలువాలతో ఘనంగా సన్మానించి గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. స్థానిక పాఠశాల విద్యార్థులు తమ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందిస్తూ తక్షణ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, క్రీడా విభాగం అధికారులు, విద్యార్థులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



