ఉత్తర ప్రదేశ్ కాన్పూర్లో :
ప్రపంచంలో రెండు వ్యక్తుల వేలిముద్రలు ఒకేలా ఉండవన్న శాస్త్రీయ నమ్మకానికి సవాల్ విసిరే ఘటన ఉత్తర ప్రదేశ్‌కు చెందిన కాన్పూర్లో వెలుగులోకి వచ్చింది. కవలలైన ప్రబల్ మరియు పవిత్ర మిశ్రాల ఫింగర్ ప్రింట్లు మాత్రమే కాదు, రెటీనా స్క్యాన్ నమూనాలు కూడా ఒకేలా ఉన్నట్లు నమోదు కావడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. ఈ విచిత్ర అంశం బయటపడటానికి కారణం వారి ఆధార్ అప్డేట్ ప్రక్రియ. కవలల్లో ఒకరి బయోమెట్రిక్ అప్డేట్ చేసే సమయంలో, మరొకరి ఆధార్ అప్రతంగా డియాక్టివేట్ కావడం సమస్యగా మారింది. వెంటనే పరిశీలించిన UIDAI అధికారులకు ఇరువురి బయోమెట్రిక్స్ పూర్తిగా ఒక్కటేలా నమోదై ఉన్నట్లు తెలిసింది.
సాధారణంగా జన్యు నిర్మాణం ఒకటే అయినా, కవలల వేలిముద్రలు, కంటి రెటీనా నమూనాలు పూర్తిగా ఒకటే కావడం శాస్త్రపరంగా అసాధ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వ్యక్తి అభివృద్ధిలో సూక్ష్మ మార్పులు చోటుచేసుకోవడం వల్ల బయోమెట్రిక్స్ ప్రత్యేకత సాధిస్తాయి. అలాంటి సందర్భంలో ఈ ఘటన కొత్త అనుమానాలకు దారితీసింది. నిజంగానే ఈ కవలల బయోమెట్రిక్స్ ఒక్కటేనా? లేదా నమోదులో సాంకేతిక లోపం జరిగిందా? అనే అంశంపై UIDAI ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది.
ఈ పరిణామం దేశవ్యాప్తంగా బయోమెట్రిక్ సిస్టమ్ నమ్మకంపై చర్చ రేపుతోంది. ఒకేలా రెండు వేలిముద్రలు ఉండవనే దృఢమైన అభిప్రాయాన్ని ఈ ఘటన ఎంతవరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.


