గన్నవరం పున్నమి ప్రతినిధి సురేష్
*గన్నవరం నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమం ఘన విజయం – యార్లగడ్డ*
*మహానాడును విజయవంతం చేసిన కార్యకర్తలకు, కూటమి నేతలకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే*
*గన్నవరంలో నగల కోసం మహిళను హత్య చేసిన ఘటనపై ఎమ్మెల్యే యార్లగడ్డ తీవ్ర దిగ్భ్రాంతి*
*గతంలో అద్దెకు ఉన్న వారే ఈ దారుణానికి ఒడిగట్టడంపై ఎమ్మెల్యే ఆవేదన*
*నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులకు సూచించిన ఎమ్మెల్యే యార్లగడ్డ*
*శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే*
*గుర్తు తెలియని వ్యక్తులు తలుపు తడితే తీయవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన*
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. శుక్రవారం గన్నవరం కార్యాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్థానిక నాయకులతో కలసి పంపిణీ చేశారు. మొత్తం 49 మంది లబ్ధిదారులకు రూ.42,58,176 విలువైన చెక్కులను అందజేశారు. బాపులపాడు మండలానికి చెందిన 15 మందికి రూ.11,74,323, గన్నవరం మండలానికి చెందిన 10 మందికి రూ.8,61,048, ఉంగుటూరు మండలానికి చెందిన 9 మందికి రూ.11,85,101, విజయవాడ రూరల్ మండలానికి చెందిన 15 మందికి రూ.10,37,704 చొప్పున సహాయం అందించామని తెలిపారు. పేదలు వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి త్వరగా విడుదలయ్యేలా చర్యలు తీసుకున్నామని హామీ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలోని 11 క్లస్టర్ల పరిధిలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం విజయవంతంగా జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. సుమారు 16 నుంచి 17 వేల మంది కార్యకర్తలు, అభిమానులు ఆన్‌లైన్ మరియు ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాలుగు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గన్నవరంలో ఇటీవల నగల కోసం ఓ మహిళను దారుణంగా హత్య చేసిన ఘటనపై ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అమానుష ఘటన అని పేర్కొంటూ, గతంలో అద్దెకు ఉన్నవారే ఈ ఘాతుకానికి పాల్పడటం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసినట్లు చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తుల తలుపులు కొడితే తీయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



