ఖమ్మం: ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 48వ డివిజన్‌లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు ప్రారంభమై 10 నెలలు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదని, దీంతో నిత్యం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు.
గత ఐదేళ్లలో డివిజన్ అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకురావడంలో స్థానిక కార్పొరేటర్ విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రహదారులు, డ్రైనేజీ తదితర సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పున్నమి ప్రతినిధి 48వ డివిజన్‌లో పర్యటించగా స్థానికులు తమ సమస్యలను వివరించారు. అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉండటంతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
కాగా, ఈ విషయమై స్థానిక బీజేపీ నాయకులు, బీజేవైఎం ఖమ్మం జిల్లా అధ్యక్షులు శాసనాల సాయిరామ్‌ను పున్నమి ప్రతినిధి చరవాణిలో సంప్రదించగా, డివిజన్‌లో అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవడంపై ఆయన స్పందించారు. ప్రజల సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకుని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సాయి రాం కోరారు



