ఆత్మకూరు మండల ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌కు వినతి
ఆత్మకూరు, సెప్టెంబర్ 21 (పున్నమి ప్రతినిధి):ఆత్మకూరు మండలంలో జల్ జీవన్ మిషన్ కింద మంజూరైన తాగునీటి పథక పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు తోడేటి అశోక్ కోరారు. మండల స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోవడంతో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించినట్లు ఆయన తెలిపారు.మండల పరిధిలోని 21 గ్రామ పంచాయతీలకు జల్ జీవన్ మిషన్ కింద మంజూరైన నీటి ట్యాంకుల నిర్మాణ పనుల్లో 11 పనులు ప్రారంభమై మధ్యలో నిలిచిపోయాయని అశోక్ పేర్కొన్నారు. మరికొన్ని పనులు ఇంకా ప్రారంభం కాలేదని తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనుల్లో కొన్ని సుమారు 50 శాతం వరకు పూర్తయ్యాయని, అనంతరం కూడా కొన్ని పనులు కొనసాగినప్పటికీ మరికొన్ని పూర్తికాలేదని ఆయన పేర్కొన్నారు.మండల ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఎంపీడీవోను రెండుసార్లు కలిసి సమస్యను వివరించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. అయినప్పటికీ సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారం కాకపోవడంతో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించినట్లు చెప్పారు.ఇప్పటికే ప్రారంభమైన పనులను త్వరగా పూర్తి చేయడంతో పాటు, ప్రారంభం కాని పనులను కూడా వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు అశోక్ తెలిపారు.


