బిక్కవోలు, అక్టోబరు 6 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు శ్రీ లక్ష్మీగణపతి ఆలయంలో మంగళవారం వరుణయాగం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో చేపట్టిన వరుణయాగంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డితో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వరుణదేవుడి కరుణ కోసం వరుణయాగాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఎల్‌నినో ప్రభావం తగ్గి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసిందన్నారు. నవంబరు, డిసెంబరు నెలల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులను రాజకీయాలకు అతీతంగా ఎదుర్కొని ప్రజల సంక్షేమానికి సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఎల్‌నినో ప్రభావం నుంచి ప్రజలు బయటపడాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుణదేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు.


