ఆత్మకూరు, ఆగస్టు 6 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు పట్టణంలో ఇటీవల వివాదాస్పదంగా మారిన వక్ఫ్ బోర్డు భూముల గుర్తింపునకు బుధవారం సంబంధిత శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. రెవెన్యూ, మున్సిపాలిటీ, వక్ఫ్ బోర్డు శాఖ అధికారుల ఆధ్వర్యంలో సుమారు 30 ఎకరాల వక్ఫ్ బోర్డు భూమిని కొలతలు వేసి హద్దులు గుర్తించారు. చెరువు కట్ట ప్రాంతం నుంచి సోమశిల రోడ్ సెంటర్ వరకు సర్వే చేపట్టి పెయింటింగ్‌తో మార్కింగ్ చేయడంతో పాటు పలు ప్రాంతాల్లో హద్దు రాళ్లను ఏర్పాటు చేశారు. ఆక్రమణకు గురైన భూములను గుర్తించి, వాటి పరిధిలో ఉన్న వారికి నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. భూముల రికార్డులను పరిశీలించి చట్టబద్ధంగా తదుపరి చర్యలు చేపడతామని వెల్లడించారు. ఈ సర్వే సందర్భంగా అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


