హైదరాబాద్: మెటా సంస్థ ఇండియా హెడ్‌ను నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేసిన ఘటనలో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబుపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు వెంటనే అమల్లోకి రావడంతో అరవింద్ బాబు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లను అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ తెలంగాణ బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సోషల్ మీడియా సంస్థ మెటా ఇండియా హెడ్‌ను కూడా నిందితుడిగా చేర్చడం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వేదికల్లో వ్యక్తులు చేసిన పోస్టులకు మెటా సంస్థను ఎలా బాధ్యురాలిగా చేస్తారనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారడంతో ప్రభుత్వం సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబుపై వేటు వేస్తూ, ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ఘటన రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.



