ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి) ముధోల్
మహిళల ఆర్థిక సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ముథోల్ మండలంలోని మచ్కల్ గ్రామంలో సర్పంచ్ కళ్యాణకర్ ఆత్మ స్వరూప్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మహిళా సమైక్య భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మహిళా సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడంతో పాటు వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అనంతరం గ్రామంలోని ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో అన్నాభావు సాఠే జయంతిని ఘనంగా నిర్వహించారు. అన్నబాహు సాటే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు. సామాజిక చైతన్యం, సమానత్వం కోసం అన్నాభావు సాఠే చేసిన కృషి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తు, పిఎసిఎస్ చైర్మన్ అంబేకర్ సాయిరాం, మాజీ జెడ్పీటీసీ లక్ష్మీనర్సాగౌడ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కల్లెడ కిష్టయ్య, సర్పంచులు గంగాధర్, ధూమా నాయక్, గణేష్ యాదవ్, ఎంపీడీవో శివకుమార్, ఏపీవో శిరీష, ఏపీఎం గురుచరణ్, స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.



