కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల జనసేన పార్టీలో చేరిన సీనియర్ రాజకీయ నాయకులు మన్నెమాల సుకుమార్‌రెడ్డిని దగదర్తి మండలానికి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు.
దగదర్తి మండల మాజీ కన్వీనర్ తాళ్లూరి వెంకట్ యాదవ్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది ముఖ్య నాయకులు మరియు క్రియాశీలక కార్యకర్తలు కావలిలోని మన్నెమాల సుకుమార్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. పార్టీ తీర్థం పుచ్చుకున్న అనంతరం తొలిసారి ఆయన్ను కలిసిన నాయకులు, ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా తాళ్లూరి వెంకట్ యాదవ్ మాట్లాడుతూ, సీనియర్ నాయకులు సుకుమార్‌రెడ్డి పార్టీలోకి రావడం నియోజకవర్గంలో జనసేన శ్రేణులకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని, దగదర్తి మండలంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
అనంతరం మన్నెమాల సుకుమార్‌రెడ్డి మాట్లాడుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కల్యాణ్ గారి ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తనపై నమ్మకంతో కలిసి వచ్చిన దగదర్తి మండల నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దగదర్తి మండలానికి చెందిన పలువురు జనసేన నాయకులు,జనసైనికులు పాల్గొన్నారు.
